సోమవారం 18 జనవరి 2021
National - Dec 17, 2020 , 19:49:03

రైతుల వెనుక మందిర్‌ వ్యతిరేకులు: యోగి

రైతుల వెనుక మందిర్‌ వ్యతిరేకులు: యోగి

బరేలీ (ఉత్తరప్రదేశ్‌) :  అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారే రైతుల ఆందోళన వెనుక ఉన్నారని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి విపక్ష పార్టీలు రైతులను వాడుకుంటున్నాయని గురువారం ఆరోపించారు. దేశంలో అశాంతి రగిలించేందుకు విపక్షాలు కుట్ర పన్నాయన్నారు.

‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌గా మనదేశం రూపుదిద్దుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న వారి పనే ఇది. తొలుత రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ కావాలని డిమాండ్‌ చేయడం.. ధర్నా వద్ద రైతుల నుంచి తొలుత వినిపించింది’ అని చెప్పారు. బరేలీలో రైతులతో జరిగిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ఎంఎస్పీ అమలు నుంచి వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం చెబుతున్నది. అటువంటప్పుడు రైతులను ఎందుకు వారు తప్పుదోవ పట్టిస్తున్నారు. అయోధ్యలో మహా రామాలయం నిర్మాణం చేపట్టడాన్ని సహించలేకపోతున్నారు. రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతోనే వారు ఆగ్రహిస్తున్నారు’ అని విపక్షాలపై యోగి మండిపడ్డారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.