Odisha Train Accident | న్యూఢిల్లీ, జూన్ 3: భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఊదరగొడుతున్నా.. కోరమాండల్ రైలు ప్రమాద ప్రాంతంలో కీలకమైన సిగ్నల్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వందే భారత్ రైళ్ల పేరుతో ఫొటోలకు ఫోజులిచ్చే కేంద్రం పెద్దలు.. దశాబ్దాల నుంచి నడుస్తున్న రైళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవటం, లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం, ప్యాసింజర్ రైళ్లను తగ్గించటం వంటి చర్యలతో ఎన్డీయే ప్రభుత్వం రైల్వేను నిర్లక్ష్యం చేస్తున్నది. ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తేకుండా మోదీ సర్కారు కావాలనే నిర్లక్ష్యం చేసింది. సాధారణంగా భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు భయపడుతారు. దీంతో ప్రయాణికులు లేరన్న కారణంతో రైళ్లను శాశ్వతంగా రద్దుచేసి అదే రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం ఇవ్వొచ్చు. ఇదే కారణంతో మౌలిక వసతులు కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
గతేడాదితో పోల్చితే 2023లో ప్రమాదాలు 37 శాతం పెరిగినట్టు రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ లహోటి ప్రకటించారు. ఈ ప్రమాదాల్లో అత్యధికం సిగ్నల్ వ్యవస్థ విఫలం కావటంతో చోటుచేసుకొన్నవే. ఖాళీలు భారీగా ఉండటంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉన్నది. దీంతో మానవ తప్పిదాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని బోర్డు సమావేశంలో గుర్తించారు.
Train Accidents
వందే భారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టి.. రైల్వేల చరిత్రనే మార్చేశామని బీజేపీ ప్రచారం చేస్తున్నది. 18 సార్లూ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వీటిని ప్రారంభించి ఫొటోలకు పోజులిచ్చారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే.. ఆ రాష్ట్రంలో వందే భారత్ రైలును ప్రారంభించటం ప్రధానికి అలవాటుగా మారింది. వందే భారత్ రైళ్ల సగటు వేగం గంటకు 70 కిలోమీటర్లే. దశాబ్దాల ముందు నుంచి నడుస్తున్న, శుక్రవారం ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు వేగం గంటకు 130 కిలోమీటర్లు కావటం గమనార్హం. రైల్వే లైన్లను, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపర్చకుండా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడితే ప్రమాదాలు పెరగటం తప్ప ఉపయోగం ఏముంటుందని రైల్వే సంఘాల నేతలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు.