రామవరం, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. 1947 అక్టోబర్ 27న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీకి చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. దాదాపు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల కఠిన కృషితో రాజ్యాంగం రూపొందించబడిందన్నారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భాన్ని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రీయాంబుల్ను కార్మికులతో చదివి వినిపించారు. అనంతరం పాల్గొన్న వారికి స్వీట్ల పంపిణీ నిర్వహించగా, “భారత రాజ్యాంగం వర్ధిల్లాలి” అనే నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో జే.లింగ యశస్వి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, బ్రాంచ్ మెంబర్, కొత్తగూడెం ఏరియా చెరుపల్లి నాగరాజు, శనిగ ప్రభాకర్, ఉరుసు సుదర్శన్, క్రాంతి కుమార్, ఆముదాల అనిల్ కుమార్, భద్రమ్మ, వంశీ, పలువురు అధికారులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Ramavaram : కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం