Nitish Kumar | బీజేపీ (BJP)కి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nitish Kumar) షాకిచ్చారు. ఏడాదిన్నరగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో బీజేపీ నేతృత్వంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ రాష్ట్రంలో జేడీయూకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. మేఘాలయాలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సైతం కొన్ని నెలల క్రితమే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. NPP నిర్ణయం ప్రకటించిన నెలల వ్యవధిలోనే నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా, మణిపూర్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే అధికార పార్టీ సంఖ్యను పటిష్టం చేస్తూ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ప్రస్తుతం అక్కడ జేడీయూకి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. ఇక 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ పార్టీ నిర్ణయంతో బీరెన్ సింగ్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ కేంద్రంలోని బీజేపీకి, బీహార్లో జేడీయూ కీలక మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీకి నితీశ్ కుమార్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకున్నారనే విషయంపై స్పష్టతలేదు.
Also Read..
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Arvind Kejriwal | మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ మేనిఫెస్టో.. కేంద్రానికి కేజ్రీవాల్ ఏడు డిమాండ్లు