న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మధ్యతరగతి వర్గాలపై తాము దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. మధ్యతరగతి వర్గాలను గత ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. ఇతర రాజకీయ పార్టీలు మధ్యతరగతి వర్గాన్ని ప్రభుత్వానికి ఏటీఎంగా పరిగణిస్తున్నాయని ఆరోపించారు. ‘దేశంలో మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారు. పన్ను ఉగ్రవాద బాధితులు. భారీ పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ప్రతిఫలం తక్కువ పొందుతున్నారు. ఏ రాజకీయ పార్టీ ఎజెండాలో ఈ సమూహం లేదు’ అని అన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అరవింద్ కేజ్రీవాల్ ఏడు డిమాండ్లు లేవనెత్తారు. ‘విద్యా బడ్జెట్ను రెండు నుంచి పది శాతానికి పెంచాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలు, స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఆరోగ్య బడ్జెట్ను పది శాతానికి పెంచాలి, ఆరోగ్య బీమాపై పన్ను తొలగించాలి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాలి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ బడ్జెట్ను మధ్యతరగతి ప్రజలకు అంకితం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.