న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై బీజేపీ మండిపడింది. దేశ రాజధానిలో చైనీస్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అరవింద్ కేజ్రీవాల్ దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Verma) ఆరోపించారు. పంజాబ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వేలాది వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వానికి చెందిన వాహనాలు వాటర్ డిస్పెన్సర్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని ఢిల్లీకి రవాణా చేస్తున్నాయని అన్నారు. పంజాబ్ ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు ఆప్ కార్యకర్తల వేషంలో ఢిల్లీలో ఉన్నారని ఆరోపించారు. అమృత్సర్కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
కాగా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి తనతో తలపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పట్ల భయపడుతున్నారని పర్వేష్ వర్మ విమర్శించారు. అందుకే పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం యంత్రాగాన్ని ఆయన వాడుకుంటున్నారని, మురికివాడల్లో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. హుడావుడిగా ఏర్పాటు చేసిన చైనా సీసీటీవీ కెమెరాలు భద్రతకు ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పంజాబ్ ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ను ఆయన డిమాండ్ చేశారు.