NIA | పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికులకు కీలక విజ్ఞప్తి చేసింది. దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే తమకు పంపాలని స్థానికులను, టూరిస్ట్‌లను కోరింది.
ఈ ఘటనపై సమాచారం ఉంటే 9654958816 లేదా 01124368800 నంబర్లకు పంపాలని పర్యాటకులు, స్థానికులకు దర్యాప్తు సంస్థ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఘటనకు సంబంధించిన సమాచారం ఉంటే స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది. సమాచారం అందించిన వారి వివరాలన గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపింది.
గతనెల 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బైసరాన్ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
Also Read..
Ajit Doval | ఆపరేషన్ సిందూర్ తర్వాత.. ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు
Ceasefire | నియంత్రణరేఖ వద్ద పాక్ దుశ్చర్య.. జవాను సహా 13 మంది మృతి