Guillain Barre Syndrome | మహారాష్ట్ర (Maharashtra)లో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 172 కేసులు నిర్ధరణ కాగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ వైరస్ కారణంగా మరో మరణం నమోదైంది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది.
గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా ముంబై (Mumbai)లో తొలి మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జీబీఎస్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. అడికి వైరస్ సోకినట్లు జనవరి 23న నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న అతడికి ఐసీయూలో చికిత్స అందించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.
తాజాగా రాష్ట్రంలో ఇవాళ ఐదు కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి వరకూ 167గా ఉన్న జీబీఎస్ కేసులు 172కి పెరిగాయి. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. 172 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 40, ఇతర గ్రామాల నుంచి 92, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 28, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వకూ 104 మంది రోగులు ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయ్యారు. ప్రస్తుతం 50 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఇంకో 20 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జీబీఎస్ అంటే ఏమిటి..?
జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ (ఒక వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయడం) సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ బారినపడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ సిండ్రోమ్‌వల్ల బాధితుడిలోని నరాలు, కండరాలు బలహీనంగా మారుతాయి. వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకిన వారు.. అలాంటి సమయంలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
జీబీఎస్ బారినపడిన వ్యక్తిలో సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడంవల్ల నాడీ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. ముందుగా పాదాల నుంచి మొదలై పైవరకు ఈ సిండ్రోమ్ పాకుతుంది. దాంతో కాళ్లు మొదలు ఒంట్లోని ఒక్కో భాగం కదలికలేకుండా పోతుంది. కండరాలు బలహీనమవుతాయి. దాంతో భరించలేని నొప్పి కలుగుతుంది. విపరీతమైన నిస్సత్తువ ఏర్పడుతుంది. ఈ సిండ్రోమ్ పెద్దవాళ్లలో, ముఖ్యంగా మగవాళ్లలో ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే, అత్యంత అరుదుగానైనా అన్ని వయసుల వారికి ఈ సిండ్రోమ్ ముప్పు పొంచి ఉంటుంది. జీబీఎస్ తాలూకూ అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు.
తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే మెషిన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి కాబట్టి నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మంలోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంది. దవడలు నొప్పిగా మారుతాయి. మాట్లాడటం, నమలడం, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందనలో, రక్తపోటులో తేడాలు వస్తాయి. జీర్ణశక్తి మందగిస్తుంది.
Also Read..
PM Modi | ఫ్రాన్స్‌లో భారత అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు
Sajjan Kumar | తండ్రీకొడుకులను తగులబెట్టిన కేసులో దోషిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్
Anil Vij | బీజేపీ మంత్రి అనిల్ విజ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్.. ఆయన ఎలా స్పందించారంటే?