చండీగఢ్: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి అనిల్ విజ్ (Anil Vij)కు ఆ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి, ముఖ్యమంత్రి నయాబ్ సైనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానం, అంతర్గత క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొంది. ఈ నోటీస్‌కు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని బీజేపీ ఆదేశించింది.
కాగా, బీజేపీ హైకమాండ్ మంగళవారం పంపిన షోకాజ్ నోటీస్‌పై మంత్రి అనిల్ విజ్ స్పందించారు. బుధవారం దీని గురించి మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలోనే పార్టీ హైకమాండ్‌కు సమాధానం పంపుతానని చెప్పారు. ‘నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చా. ముందుగా ఇంటికి వెళ్తా. చల్లనీళ్లతో స్నానం చేస్తా. రోటీ తింటా. ఆ తర్వాత కూర్చొని షోకాజ్ నోటీస్‌కు సమాధానం రాసి పంపుతా’ అని అన్నారు.
మరోవైపు బీజేపీలో సీనియర్ నేత అయిన అనిల్ విజ్ గతంలో కూడా సొంత పార్టీతోపాటు కొందరు నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హర్యానాలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.