న్యూఢిల్లీ: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి భారీ స్కామ్ బయటపడింది. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) కోటా కింద విద్యార్థుల అడ్మిషన్ కోసం నకిలీ పత్రాలు వినియోగించారు. (MBBS Admission Scam Busted) విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. పలు రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసింది. నకిలీ పత్రాలతో సుమారు 18,000 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ ఎన్నారై సర్టిఫికెట్లు, అమెరికాలో పనిచేస్తున్న నోటరీ అధికారుల స్టాంపులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఎన్నారైలకు సంబంధించి రాయబార కార్యాలయ పత్రాలు, ఎన్నారై కుటుంబ సభ్యులకు సంబంధించి నకిలీ పత్రాలు తయారీకి మెడికల్ కాలేజీలే ఏజెంట్లకు డబ్బులు చెల్లించినట్లు ఈడీ దర్యాప్తులో తెలిసింది. అలాగే కొందరు స్టూడెంట్స్కు సంబంధించిన నకిలీ పత్రాలు పలువురి అడ్మిషన్ కోసం కూడా వినియోగించినట్లు బయటపడింది. కొంతమంది నిజమైన ఎన్నారై అభ్యర్థులు కూడా ఈ ముఠాలో భాగమయ్యారు. వారి పేర్ల ఉపయోగించుకునేందుకు ఏజెంట్లు వారికి డబ్బులు చెల్లించారు.
మరోవైపు నకిలీ పత్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ ఎన్నారై కోటా కింద కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అనర్హుల ప్రవేశంపై పశ్చిమ బెంగాల్, ఒడిశా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈడీ ఆరోపించింది.
Also Read:
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం
Asaduddin Owaisi | రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా?: అసదుద్దీన్ ఒవైసీ