బెంగళూరు: ఒక వ్యక్తి రూ.5 కోట్లకు జీవిత బీమా చేసినట్లు ఒక ముఠా తెలుసుకున్నది. దీంతో అతడ్ని హత్య చేసి ఆ డబ్బులు పొందేందుకు ప్రయత్నించింది. (Man Murdered for insurance) ఆ ముఠాకు చెందిన మహిళ నకిలీ భార్యగా నటించింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వ్యవహారం బయటపడింది. కర్ణాటకలోని హోస్పేట్లో ఈ సంఘటన జరిగింది. పాక్షికంగా పక్షవాతం ఉన్న 34 ఏళ్ల గంగాధర్‌కు రూ.5.2 కోట్ల జీవిత బీమా పాలసీ ఉన్నట్లు ఆరుగురు సభ్యుల ముఠా గుర్తించింది. ఆ బీమా డబ్బు పొందేందుకు ప్లాన్ వేసింది.
కాగా, ఆ ముఠా సభ్యులు గంగాధర్‌ను హత్య చేశారు. అతడి మృతదేహాన్ని నగర శివారు ప్రాంతానికి తరలించారు. ద్విచక్ర వాహనంపై గంగాధర్ మృతదేహాన్ని ఉంచి కారుతో ఢీకొట్టారు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆ ముఠాకు చెందిన హులిగెమ్మ, గంగాధర్ భార్యగా పేర్కొంటూ బీమా కోసం క్లైమ్ చేసింది.
మరోవైపు సెప్టెంబర్ 28న ఉదయం 5.30 గంటలకు సండూర్ రోడ్డులో హిట్ అండ్ రన్ కేసు గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడ్ని గంగాధర్‌గా గుర్తించారు. హోస్పేట్లోని కౌల్పేటకు చెందిన అతడి భార్య శారదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
కాగా, గంగాధర్‌తో ఆరేళ్ల కిందట తనకు పెళ్లి జరిగినట్లు భార్య శారదమ్మ తెలిపింది. మూడేళ్ల కిందట భర్తకు పక్షపాతం వచ్చిందని, ఎడమ వైపు శరీరంలో చలనం లేదని చెప్పింది. తన భర్తకు ద్విచక్ర వాహనం లేదని వివరించింది.
దీంతో గంగాధర్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయగా అతడి భార్యగా పేర్కొన్న హులిగెమ్మ రూ.5.2 కోట్ల బీమా క్లైయిమ్ కోసం ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఆమెతో సహా ఆ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. నేరానికి వినియోగించిన ద్విచక్ర వాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Cough Syrup Row | దగ్గు మందు మరణాలపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు.. డ్రగ్ కంట్రోలర్ సస్పెండ్
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు