Dowry Murder : వరకట్నం (Dowry) కోసం కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి తగులబెట్టి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా గాలిస్తున్న పోలీసులకు నిందితుడు విపిన్ భాటి (Vipin Bhati) తారసపడ్డాడు. పోలీసులు లొంగిపొమ్మని హెచ్చరించినా వినిపించుకోకుండా వారిపై దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అతడి కాళ్లకు గురిపెట్టి షూట్ చేశారు. నిందితుడి ఎడమ కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పట్టుబడ్డ నిందితుడు భార్య హత్యపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయడం లేదు. తాను ఆమెను చంపలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు. నిత్యం కట్నం కోసం వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు ఉంటాయి’ అని తేలిగ్గా రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం నిక్కీ అనే 30 ఏళ్ల మహిళను అత్తింటి వారు కిరోసిన్ పోసి తగులబెట్టి చంపారు.
కన్నకొడుకు, తోడబుట్టిన సోదరి చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా నిక్కీని ఆమె భర్త విపిన్, అత్తింటివారు కొంతకాలంగా కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తలొగ్గి నిక్కీ కుటుంబసభ్యులు మొదట స్కార్పియో కారు కొనిచ్చారు. అయినా సరిపెట్టుకోకుండా బుల్లెట్ బైక్ కావాలని వేధించడంతో బుల్లెట్ మోటార్ సైకిల్ కూడా కొనిచ్చారు.
అప్పటికీ వారి ధనదాహం తీరలేదు. ఇటీవల నిక్కీ తండ్రి కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ కారుపై వారి కన్ను పడింది. దాన్ని కూడా తమకే ఇవ్వాలని, అందుకు తండ్రిని ఒప్పించాలని నిక్కీని వేధించారు. అందుకు నిక్కీ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించారు. వేధింపులను మరింత తీవ్రం చేశారు. నిక్కీపై దాడి చేసి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. ఆమెపై కిరోసిన్ లాంటి ద్రావణం పోసి నిప్పంటించారు.
ఈ దారుణమంతా ఆమె ఆరేళ్ల కుమారుడు, అదే ఇంటి పెద్ద కోడలుగా ఉన్న ఆమె సోదరి కళ్ల ముందే జరిగింది. నిక్కీ సోదరి కాంచన్ మాట్లాడుతూ.. రూ.36 లక్షల కట్నం ఇమ్మంటే ఇవ్వడంలేదనే కోపంతోనే తన సోదరిని ఆమె భర్త, అత్తింటివారు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. వారు అడిగినవన్నీ ఇచ్చామని, అయినా నా కూతురిని వేధించి చంపేశారని మృతురాలి తండ్రి విలపించారు.
నిందితులను ఎన్కౌంటర్ చేసి, వారి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తాము నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.