Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) కార్యక్రమం మంచి ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అయితే, దాని అమలులో ప్రధాని మోదీ (PM Modi) విఫలమయ్యారని పేర్కొన్నారు. పార్లమెంట్ (Parliament)లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ మాట్లాడారు.
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది మంచి ఆలోచన అని నేను భావిస్తున్నాను. దీని ఫలితాలు మీ ముందే ఉన్నాయి. 2014లో దేశ GDPలో తయారీ రంగం వాటా 15.3% ఉండగా, ప్రస్తుతం ఇది 12.6%కి పడిపోయింది. ఇది గత 60 ఏళ్లలో తయారీ రంగం కనీస స్థాయికి చేరిన పరిస్థితి. నేను ప్రధాన మంత్రిని నిందించడం లేదు. ఆయన ప్రయత్నించలేదు అని చెప్పడం కూడా సరికాదు. కానీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే దీని అమలులో ప్రధాని విఫలమయ్యారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై.. దాన్ని చైనాకు అప్పగించామన్నారు. ఉత్పత్తిలో భారత్ నిలదొక్కుకోకపోవడం వల్ల చైనా ఇక్కడ పాగా వేసిందన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
‘ఏ దేశమైనా ప్రధానంగా రెండు విషయాలను నిర్వహిస్తుంది. అందులో ఒకటి వినియోగం, మరొకటి ఉత్పత్తి. వినియోగాన్ని నిర్వహించడాన్ని సర్వీసుల రంగం అని చెబుతాం. ఉత్పత్తి నిర్వహణ అంటే తయారీ రంగం అని. అయితే, ఉత్పత్తి అనేది కేవలం తయారీతో మాత్రమే పరిమితం కాదు. ఒక దేశంగా మనం ఉత్పత్తిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాం. మన దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. అవి ఉత్పత్తిని నిర్వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ మనం చేసిందేంటంటే..? తయారీ రంగాన్ని చైనా చేతుల్లో పెట్టేశాం. ఉదాహరణకు, మొబైల్ ఫోన్ మనం భారతదేశంలో తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఇది నిజం కాదు. ఫోన్ అసెంబ్లింగ్ మాత్రమే భారత్‌లో జరుగుతోంది. దీని అన్ని భాగాలు చైనాలో తయారవుతున్నాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read..
Monalisa | ఈరోజు పోస్టర్ బయట.. రేపు పోస్టర్ లోపల.. సినీ ప్రయాణంపై మోనాలిసా ఆసక్తికర పోస్ట్
Ratha saptami | రేపే రథసప్తమి.. ఆ విశేషాలు మీ కోసం
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం