Toll Free | అసెంబ్లీ ఎన్నికలకు ముందు (before polls) మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై (Mumbai)కి వెళ్లే మార్గంలోని ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు (Toll Free) చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం ప్రకటించారు.
మహారాష్ట్ర మంత్రి వర్గం నేడు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలోనే సీఎం షిండే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టోల్ మినహాయింపు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ముంబైలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు టోల్ గేట్ల వద్ద ఫీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దహిసర్, ములుంద్, ఐరోలి, తిన్హంత్, వాషి.. ఈ ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనదారులు టోల్ కట్టాల్సిన అవసరం లేదు. టోల్ కట్టకుండానే వీటి గుండా ముంబైలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఇక్కడ టోల్ ఫీజుగా రూ.45 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మహారాష్ట్రలోని ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లే ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. తేలికపాటి మోటారు వాహనాలు అంటే కార్లు, ఎస్యూవీ వాహనాలు. బస్సులు, లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులకు ఈ నిర్ణయం వర్తించదు. రోజూ 6 లక్షలకు పైగా వాహనాలు ముంబైకి రాకపోకలు సాగిస్తుండగా.. అందులో 80 శాతం తేలికపాటి మోటారు వాహనాలే.
కాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ముంబైలో 55 ఫ్లైఓవర్లను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్లకు అయిన ఖర్చును రికవరీ చేసేందుకు మొదటగా నగర ప్రవేశాల వద్ద టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వంతెనల నిర్మాణం తుది దశకు చేరుకోగానే టోల్ బూత్‌ల నిర్మాణానికి 1999లో టెండర్లు వేశారు. 2002లో మొత్తం ఐదు టోల్ బూత్‌లను ప్రారంభించారు. అప్పటి నుంచి ముంబైలోకి ప్రవేశించే వాహనాలకు ఈ ఐదు టోల్ బూత్‌ల ద్వారా ఫీజు వసూలు చేస్తున్నారు.
అయితే, ఈ నిర్వహణ డబ్బు మొత్తం 10 ఏళ్ల క్రితమే రికవరీ అయ్యింది. అయితే ప్రభుత్వం మాత్రం టోల్ వసూలు చేస్తూనే ఉంది. గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ రికవరీని మరో మూడేళ్లపాటు అంటే 2027 వరకూ పొడిగించింది. దీని ద్వారా మహా ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఆశించింది. అయితే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, శివసేనకు చెందిన కొందరు నాయకులు అన్ని ముంబై బూత్‌లలో టోల్ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శివసేన (UBT) నేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే కూడా ముంబైలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ మినహాయింపునకు డిమాండ్ చేశారు.
Also Read..
UI The Movie | ఉపేంద్ర యూఐ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్.. రిలీజ్ లుక్‌తో సూపర్ హైప్
TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్లు.. విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ