రఘునాథపాలెం, మార్చి 7 : ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయోగంతో నిలువ నీడను కోల్పోయి 12 రోజులుగా ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల పేదలను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
భూదాన్ భూముల్లో 100 గజాల స్థలం, రూ.5 లక్షలు నగదు ఇచ్చేవరకు పునరావాస కేంద్రం నుంచి బాధితులు వదిలివెళ్లే ప్రసక్తేలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఏన్నో ఏండ్లుగా భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకుని ఉంటున్న పేదలను ఒక్కసారిగా రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లను తీసుకొచ్చి వేలాది పోలీస్ బలగాల నడుమ ఇండ్లను నేలమట్టం చేసి పైశాచిక ఆనందాన్ని పొందిందని ఆవేదన చెందారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్.. రెండున్నర ఏండ్లుగా పేదల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. 12రోజులుగా అసౌకర్యాల నడుమ ఇంటి సామగ్రిని కాపాడుకుంటూ బిక్కుబిక్కుమని కుటుంబాలతో రోజులు గడుపుతుంటే జిల్లాలోని మంత్రులు, అధికారులు పునరావాస కేంద్రం నుంచి వారిని వెళ్లగొట్టే కుట్రలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు.
బాధితుల తరఫున న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ‘పువ్వాడ ఫౌండేషన్’ అండగా ఉంటూ సేవలందిస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా వెలుగుమట్ల బాధితులకు నిత్యం రెండుపూటల భోజనం, వైద్యశిబిరం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బాధితులకు పువ్వాడ అజయ్‌కుమార్ స్వయంగా భోజనాలు వడ్డించారు. తదుపరి వైద్యశిబిరంలో మందులు అవసరమైన పేదలకు ఉచితంగా అందజేశారు.