హైదరాబాద్ : విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాది(Sai Baba) సహజ మరణం కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(CPI Narayana) ఆరోపించారు. సోమవారం గన్‌పార్క్ వద్ద సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సం ఆయన మాట్లాడు తూ..సాయిబాబా చనిపోయిన ఆయన సిద్ధాంతాలు బతికే ఉంటాయన్నారు. పదేండ్లు అన్యాయంగా అతడి నాగ్‌పూర్ జైళ్లో బంధించారని విమర్శించారు. ఆయన హత్యకు అసలు దోషి ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, సాయిబాబాకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) నివాళులర్పించారు.
మౌలాలిలోని ఆయన నివాసానికి చేరుకున్న హరీశ్‌రావు.. సాయిబాబా పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాయిబాబా మృతి బాధాకరమని చెప్పారు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి నిర్ధోషిగా బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలా జరగడం శోచనీయమన్నారు. దశాబ్ద కాలంపాటు ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అని తెలిపారు. ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరమన్నారు. హరీశ్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్ నాయక్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.