Hindi language | మహారాష్ట్ర (Maharashtra) లో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడవ భాషగా బోధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, ఆ నిర్ణయంపై మహా సర్కార్ తాజాగా వెనక్కి తగ్గింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. హిందీ తప్పనిసరి అన్న పదాన్ని నోటిఫికేషన్లో తీసేసింది (Hindi Not Mandatory In Schools).
కాగా, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడవ భాషగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై కాంగ్రెస్, ఎంఎన్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎక్స్‌లో స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపైన కూడా విరుచుకుపడ్డారు.
త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేసుకోవాలని, విద్య విషయంలో దానిని తీసుకురావద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రతి దానినీ హిందీయీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అనుమతించేది లేదన్నారు. మరాఠీ, మరాఠీయేతరుల మధ్య ఘర్షణను సృష్టించి, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ, ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీ తప్పనిసారి ఏమీ కాదని స్పష్టం చేసింది.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా
సమస్యల సుడిలో ఎయిరిండియా!.. 48 గంటల వ్యవధిలో 8 విమానాల్లో సాంకేతిక లోపాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్