దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్నటికి మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరిచిపోకముందే, ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. గడిచిన 48 గంటల్లోనే 8 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆయా విమానాలను అధికారులు అత్యవసరంగా ఎక్కడికక్కడ నిలిపేశారు. మరోవైపు ఇండిగో సంస్థకు చెందిన మరో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెరసి విమానంలో ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, జూన్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. తొలుత న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు సురక్షితంగా వచ్చిన ఈ విమానం.. లండన్ ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైనట్టు సమాచారం. దీంతో విమాన సర్వీసును రద్దు చేశారు. అయితే సాంకేతిక సమస్య వచ్చిందన్న వార్తలను ఎయిరిండియా తోసిపుచ్చింది. విమానం అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. మరోవైపు, ఢిల్లీ నుంచి పారిస్‌కు మంగళవారం బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలో అధికారులు సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ఈ విమాన సర్వీసును రద్దు చేశారు.
శాన్ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి ప్రయాణమైన ఎయిరిండియా విమానం మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండయ్యింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించేసి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. ఇంకోవైపు, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలోనూ పలు సమస్యలు వచ్చాయి.
ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో డీజీసీఏ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రతినిధులతో మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది.
మంగళవారం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానం నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. బాంబు ఉన్నదంటూ వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో విమానాన్ని దించేసిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.