Madras High Court : ప్రభుత్వ పథకాల (Government Schemes) ప్రచారం కోసం వాడే పేర్ల విషయంలో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకురాబోయే ప్రజా సంక్షేమ పథకాల ప్రచారం కోసం జీవించి ఉన్న నేతలపేర్లు వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రచార ప్రకటనల్లో మాజీ ముఖ్యమంత్రుల చిహ్నాలు, డీఎంకే పార్టీ గుర్తులు, జెండాను ఉపయోగించకుండా నిషేధించింది.
ఈ విషయాన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అన్నాడీఎంకే పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఉంగలుడాన్ స్టాలిన్ (Ungaludan Stalin)’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం సవాల్ చేశారు. ఈ అంశంపై తాము ఇచ్చిన ఉత్తర్వులు ఏ ప్రభుత్వ పథకం ఆవిష్కరణ, అమలుకు అడ్డంకి కాబోదని న్యాయస్థానం స్పష్టంచేసింది. అలాగే ఈ వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పార్టీ తమ స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది.