భోపాల్: ఒక మంత్రి మరోసారి నోరుజారారు. ప్రభుత్వ పథకం లబ్ధిపొందే మహిళలు సీఎం బహిరంగ సభలకు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారు పొందే లబ్ధిని ఆపేస్తామని హెచ్చరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి, రత్లాం జిల్లా ఇన్చార్జ్ విజయ్ షా (Vijay Shah) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రత్లాంలో జరిగిన జిల్లా అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో లాడ్లీ బెహ్నా లబ్ధిదారుల సంఖ్య గురించి మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులను మంత్రి విజయ్ షా అడిగారు. రత్లాం జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ఆయనకు చెప్పారు.
కాగా, మంత్రి విజయ్ షా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున 2.5 లక్షల మంది లబ్ధిదారుల్లో కనీసం 50,000 మంది మహిళలు గౌరవం చూపించడానికి ముందుకు రావాలని అన్నారు. ‘ప్రభుత్వం నెలకు రూ. 1,500 చొప్పున కోట్ల రూపాయలు ఇస్తోంది. కాబట్టి కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి ధన్యవాదాలు చెప్పడం తప్పనిసరి. మేం ఆహారాన్ని ఏర్పాటు చేస్తాం. సభలకు రాని మహిళలకు ఏమి జరుగుతుందో చూద్దాం’ అని హెచ్చరించారు. ‘ఎవరికైనా ఆధార్ లింక్ చేయకపోతే, వారి దరఖాస్తు నిలిచిపోతుంది. అంటే అది స్వయంచాలకంగా ఆగిపోతుంది. అప్పుడు అందరూ వస్తారు’ అని ఆయన అన్నారు.
దీంతో సమావేశంలో పాల్గొన్న అధికారులు ఇది విని షాక్ అయ్యారు. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై మండిపడింది.
Also Read:
Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?