Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు (paramilitary forces) సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో కూడా సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్‌లోయ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కశ్మీర్ ప్రాంతంలో ఎక్కడికక్కడ భద్రతా దళాలు మోహరించాయి. ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టాయి. అన్ని వైమానిక స్థావరాల్లోనూ యుద్ద విమానాలు కథన రంగంలోకి దిగేందుకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నావికాదళం సముద్రతీర ప్రాంతాల్లో భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరించింది. సరిహద్దులకు వేలాదిమంది సైన్యాన్ని తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.
మరోవైపు జమ్ము కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కాసేపటి కిందే కశ్మీర్ చేరుకున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో ఆయన పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎల్వోసీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Also Read..
Bandipora | బందిపొరాలో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Indus Water Treaty: సింధూ జలాల ఒప్పందం సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ
Pak opens Firing | పాక్ కవ్వింపు చర్య.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు