న్యూఢిల్లీ: 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే భారత సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్థాన్‌కు కూడా ఆ నోటీఫికేషన్ చేర వేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తూ భారత సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అధికారిక నోటిఫికేషన్‌కు చెందిన సమాచారాన్ని రిలీజ్ చేశారు. 1960, సెప్టెంబర్ 19వ తేదీన సిందూ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సుమారు తొమ్మిదేళ్ల పాటు జరిపిన చర్చల తర్వాత ఆ డీల్ కుదిరింది. సరిహద్దుల్లో ప్రవహిస్తున్న నదుల నీటి వాడకానికి సంబంధించి ఆ ఒప్పందం జరిగింది.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. అత్తారి బోర్డర్‌ను మూసివేసింది. అత్తారి బోర్డర్ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తానీలు మే ఒకటో తేదీలోగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని పాకిస్థాన్ తిరస్కరించింది. నీటిని అడ్డుకునే ప్రయత్నం యుద్ధ చర్యగా భావిస్తున్నట్లు పాకిస్థాన్ చెప్పింది.