హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు కేటాయించిన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐవోఈ) నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, టీఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం క్యాంపస్‌లో ధర్నా, అనంతరం క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఐవోఈ నిధులను విద్యార్థుల సంక్షేమానికి కాకుండా అనవసరమైన నిర్మాణాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
మొత్తం నిధుల్లో కేవలం 0.78% మాత్రమే విద్యార్థుల పరిశోధనలకు, ప్రయాణ గ్రాంట్లకు ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన నిధుల్లో రూ.55 కోట్లను అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించారని అభ్యంతరం వ్యక్తంచేశారు. వర్సిటీలో 65% మంది వెనుకబడిన తరగతల విద్యార్థులేనని, వారికి అందాల్సిన స్కాలర్షిప్లు, ఆర్థికం సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఐవోఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.