రాజన్న సిరిసిల్ల, జూలై 30( నమస్తే తెలంగాణ) : సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతు లు, ప్రజలను అప్రమత్తం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సూపర్ ఎల్‌నినోపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా, మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేశ్ బిగితే తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదురొనేందుకు జిల్లా అధికార యంత్రాం గం ఆధ్వర్యంలో రూపొందించిన పీపీటీని ప్రదర్శించారు.
జిల్లా ఎల్ నినో ప్రణాళిక, తెలంగాణ జలసిరి పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిషరించారు. జిల్లా పరిధిలోని ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి? వాటిలో నీటిమట్టం? జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశా రు? మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా? విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రిజర్వాయర్లలో నీరు తాగునీటికి మాత్రమే వచ్చే ఏడాది జూలై వరకు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నిరుటితో పోలిస్తే భూగర్భ జలాలు రెండు మీటర్లకుపైగా లోతులోకి వెళ్లాయని వెల్లడించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.