హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న లక్షల మంది నిరుద్యోగులు మం డిపడుతున్నారు. నిరుద్యోగుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని 17వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తారేమోనని ఆశపడ్డామని, కానీ 7,437 పోస్టులతోనే సరిపెట్టిందని ఆ గ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పోలీసు కొలువులకు నోటిఫికేషన్లు వస్తాయేమోనని ఆశపడి.. తమ తల్లిదండ్రులు చెమటను రక్తంగా మార్చి పంపిన డబ్బులను కోచింగ్ సెంటర్లకు ధారపోసినదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. 12 లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగాల అభ్యర్థులకు ప్రభు త్వం ప్రకటించిన 7వేల కొలువులు ఏ మూలకు సరిపోతాయని వాపోతున్నారు.
తెలంగాణవ్యాప్తంగా హోంశాఖలో సుమారు 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వం కేవలం 7,437 ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. తక్షణం 20వేల పోలీసు కొలువులతో నోటిఫికేషన్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. భారీగా పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేపి, తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు తక్కువ పోస్టులు ఇచ్చి.. మోసగించారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయని మండిపడుతున్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రతిసారీ 16వేల పోస్టులకు తగ్గకుండా కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చారని, అంతటి సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల అప్పులు చేసి మరీ ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్న తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
పోలీసు కొలువులు 20వేలకు పెంచాలని, వయోపరిమితిని సడలించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు నిరుద్యోగ జేఏసీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. పోలీసు కొలువులే కాకుండా.. మిగతా విభాగాల్లోనూ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆగస్టు 5న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సీసీఎస్ఏ ద్వారా వేలాదిగా జీపీవో పోస్టులు, టీజీఎల్పీఆర్బీ ద్వారా 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు, 25వేల ఖాళీలు భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో బ్యాగ్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అభాసుపాలు కాగా.. రెండున్నరేండ్ల నుంచి ఒక్కటైనా సరైన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని మండిపడుతున్నారు. ఆగస్టు 5న చేపట్టే నిరుద్యోగ శాంతియుత ర్యాలీకి భారీగా తరలిరావాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 7,437 పోస్టులు వద్దంటూ 20వేల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు నిరుద్యోగ జేఏసీ నేతలు బుధవారం అర్ధరాత్రి దిల్సుఖ్నగర్లో ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో జేఏసీ నాయకులు ఆకాశ్, ఇంద్రానాయక్, నవీన్ పట్నాయక్, శింబు, భూక్యాకుమార్ ఉన్నారు. గతంలోనూ పోలీసు ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని, పోస్టుల సంఖ్య పెంచాలని ఆందోళనలు చేసినప్పుడు ఇలాగే అక్రమ అరెస్టులు చేశారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం? ఇదేనా ప్రజా పాలనా? అంటూ నిరుద్యోగులు రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.