హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రావాల్సిన నిధుల్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, విడుదల ప్రక్రియలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ నిధుల కేటాయింపు, విడుదలలో కూడా తీవ్ర వివక్ష చూపింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలు (15వ ఆర్థిక సంఘం అవార్డు కాలం)లో తెలంగాణకు మొత్తం రూ.9,048 కోట్లు కేటాయించగా, కేంద్రం రూ.7,957 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
అంటే దాదాపు 12 శాతం నిధులను నిలిపివేసింది. 2020-21 నుంచి 2023-24 వరకు గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఉన్నంతవరకు అంటే తొలి నాలుగేండ్లలో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి రూ.1,514 కోట్లు కేటాయించగా, అందులో రూ.1,281 కోట్లు మాత్రమే (రూ.233 కోట్లు కోత) విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఈ ఏడాది రూ.1,477 కోట్లు కేటాయించగా, కేవలం రూ.620 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఒక ఏడాదిలోనే రూ.857 కోట్ల నిధులను నిలిపివేశారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, రక్షిత మంచి నీటి సరఫరా, రోడ్ల నిర్వహణ వంటి అత్యవసర సేవలకు ఆర్థిక సంఘం గ్రాంట్లు అత్యంత కీలకం. కేంద్రం నుంచి రూ.1,091 కోట్ల మేర నిధులు బకాయిపడటంతో తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి పనులు మందగించే ప్రమాదం ఏర్పడింది.
కేవలం 15వ ఆర్థిక సంఘం నిధుల్లోనే కాకుండా, పంచాయతీ ప్రతినిధుల శిక్షణ, సామర్థ్యం పెంపు కోసం కేంద్రం అమలు చేసే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) నిధుల విడుదలలోనూ తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. గడిచిన ఐదేండ్లలో (2021-22 నుంచి 2025-26 వరకు) దేశవ్యాప్తంగా పంచాయతీల సామర్థ్యం పెంపు కోసం వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులను విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (జూలై 2025 వరకు) రూ.791.76 కోట్లు కేటాయించారు. తెలంగాణలో మొత్తం 13,598 పంచాయతీరాజ్ సంస్థలు ఉండగా, అందులో 13,142 సంస్థలు (96% పైగా) విజయవంతంగా ఆన్లైన్లో ఆడిట్ నివేదికలను సమర్పించాయి.
గత ఐదేండ్ల్ల కాలంలో (2021-22 నుంచి 2025-26 వరకు) తెలంగాణకు కేంద్రం నుంచి విడుదలైన నిధులు రూ.23 కోట్లు మాత్రమే. 2021-22, 2022-23, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణకు ఈ పథకం కింద ఒక రూపాయి కూడా కేంద్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఇదే సమయంలో మహారాష్ట్రకు రూ.340 కోట్లు, ఏపీకి రూ.76 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.377 కోట్లకుపైగా ఆర్జీఎస్ఏ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, డిజిటలైజేషన్లో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో కోతలు విధించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు విడుదలైన నిధులో జరిగిన అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాలకు నిధుల కేటాయింపు, విడుదలలో కూడా కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష చూపుతున్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.12,856 కోట్లు కేటాయించగా, అందులో రూ.12,681 కోట్లు (98.6%) విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన రూ.47,764 కోట్లు, బీహార్‌కు రూ.24,579 కోట్లు, గుజరాత్‌కు కేటాయించిన రూ.15,650 కోట్లను దాదాపు 100 శాతం కేంద్రం విడుదల చేసింది.
కానీ, తమిళనాడుకు రూ.17,666 కోట్లలో రూ.15,420 కోట్లు (రూ.2,246 కోట్లు పెండింగ్), కర్ణాటకకు రూ.15,756 కోట్లలో రూ.11,906 కోట్లు (రూ. 3,850 కోట్లు పెండింగ్) విడుదలయ్యాయి. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు దకాల్సిన ఆర్థిక సంఘం నిధులను సకాలంలో ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించడం, 100శాతం నిధులు ఇవ్వడం తెలంగాణ వంటి రాష్ట్రాలకు కోతలు విధించడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
