Laxman Singh : కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడైన దిగ్విజయ్ సింగ్ (Divijaya Singh) సోదరుడు లక్ష్మణ్ సింగ్ (Laxman Singh) పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పైన, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Rabert Vadra) పైన లక్ష్మణ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వెనుకాముందు ఆలోచించకుండా ముఖ్య నాయకులను అవమానించే వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. లక్ష్మణ్ సింగ్‌ను బహిష్కరించారని కాంగ్రెస్ పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. ఆరేళ్లపాటు ఆయనను బహిష్కరించినట్లు తెలిపింది. రాహుల్‌గాంధీ, రాబర్ట్ వాద్రా అమాయకుల్లా మాట్లాడుతున్నారని, వారి తెలివితక్కువతనం వల్ల దేశం అనేక పరిణామాలను ఎదుర్కొంటోందని పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యానించారు.
దాంతో పార్టీ ముఖ్య నాయకులను కించపర్చేలా మాట్లాడిన మీపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలని పేర్కొంటూ కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులకు లక్ష్మణ్ సింగ్ సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.