Justice BR Gavai | సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ (Justice BR Gavai) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ తదితరులు పాల్గొన్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలి బుద్దిస్టు, రెండో దళిత వ్యక్తిగా గవాయ్ రికార్డుకెక్కారు. ఈ సందర్భంగా నూతన సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. అంబేద్కర్ సూత్రాలను అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు. జస్టిస్ బీఆర్ గవాయి తండ్రి ఆర్ఎస్ గవాయ్. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్ముఖ నేత. బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా చేశారు.
ఇక గవాయ్.. 1985 మార్చి 16న బార్లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు.
పలు కీలక తీర్పులు..
పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ పాత్ర ఉంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ర్టాలకు అధికారాలను అందచేస్తూ 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ ముఖ్యమైన తీర్పును వెలువరిస్తూ 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తినీ కూల్చరాదని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీచేసింది. అడవులు, వన్యప్రాణులు, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశాలను విచారించే ధర్మాసనాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు.
Also Read..
Arunachal Pradesh: అరుణాచల్‌కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా ఖండించిన భారత్
Microsoft layoff | ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. వేలాది మందిపై వేటు
Donald Trump | మీరు రాత్రి పూట నిద్రపోతారా..?.. సౌదీ యువరాజుకు అసాధారణ ప్రశ్న వేసిన ట్రంప్