Jai Shankar : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో లోక్ సభ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై చర్చకు ప్రతిపక్షం పట్టుపట్టడంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం పక్కా సమాచారంతో వివరణ ఇస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) ఇదే అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు మీడియాలో వచ్చినట్టు ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ అంతా ఉట్టిదేనని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ అంశాలపై విపక్షాలకు వివరణ ఇస్తూ జైశంకర్ పలు అంశాల్ని ప్రస్తావించారు. భారత సైన్యం దాడుల్ని తట్టుకోలేక దాయాది దేశమే కాళ్ల బేరానికి వచ్చిందని జైశంకర్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోడీ, ట్రంప్‌ల మధ్య ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకూ ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. అయితే.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాల్ చేసి మోడీతో మాట్లాడారు. పాకిస్థాన్ భారీ దాడికి పాల్పడనుందని ఆయన చెప్పగా.. ఒకవేళ అదే జరిగితే మేము అంతకంటే భారీ దాడులతో బదులిస్తామని మోడీ అన్నారు. మే 9, 10వ తేదీన పాక్ సైన్యం క్షిపణిదాడులను భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది’ అని జైశంకర్ తెలిపారు.
Speaking in Lok Sabha during special discussion on India’s strong, successful and decisive #OperationSindoor.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 28, 2025
అంతేకాదు కాల్పుల విరమణకు పాక్ సిద్ధంగా ఉందని పలు దేశాలు తమకు సమాచారం అందించాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయితే.. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయగా.. హోమ్ మినిస్టర్ అమిత్ షా (Amit Shah) కలగజేసుకున్నారు. ప్రతిపక్షాలు మనదేశ విదేశాంగ శాఖ మంత్రినే శంకిస్తున్నాయని.. వాళ్లకు ఇతర దేశాలపై మాత్రం నమ్మకం ఉందని గట్టి కౌంటర్ ఇచ్చారు షా. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. స్వదేశీ క్షిపణులతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర స్థావరాలను రెప్పపాటులోనే నేలమట్టం చేసింది ఆర్మీ.