నారాయణపేట : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal Lift Irrigation) పథకానికి బలవంతంగా భూసేకరణ చేయడాన్కి నిరసిస్తూ భూ నిర్వాసితులు తలపెట్టిన చలో కలక్టరేట్‌ను ( Chalo Collectorate) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూ నిర్వాసితులు రోడ్డుపై దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వం బలవంతంగా, ప్రలోభాలు, మోసాలు చేస్తూ భూ సేకరణ చేపట్టవద్దని , 2013 భూ సేకరణ చట్ట ప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. నారాయణపేట ( జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు . అయితే పోలీసులు వీరిని శాషన్ పల్లి రోడ్డులో అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీవో రామచందర్ రైతులను బెదిరించడం సరైనది కాదని అన్నారు.
బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా బేసిక్ ధరను నిర్ణయించి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పరిధిలో భూమిని కోల్పోతున్న దాదాపు 20 గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, మచ్చెందర్ మాట్లాడాతూ
రైతులకు న్యాయమైన పరిహారం అందేదాకా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన నారాయణపేట జిల్లాకు ప్రాజెక్టు తప్పనిసరి అవసరమని, అదే సమయంలో భూనిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని కోరారు.
రాస్తారోకో వద్దకు వచ్చిన కలెక్టర్ సచిన్ గంగ్వార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, కానుకుర్తి గ్రామ మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జోషి, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు కాశప్ప, భూనిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు టి.ధర్మరాజు, ఆంజనేయులు, సింగారం హనుమంతు, అంజప్ప , లక్ష్మీకాంత్, కేశవ్, రవి, రాఘవేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, తరుణ్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ , మహేష్ కుమార్ గౌడ్, రామకృష్ణ, జిలాని తదితరులు పాల్గొన్నారు.