జూలూరుపాడు, జూలై 28 : ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేశ్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఆంధ్రా రాబంధును మాజీ మంత్రి కేటీఆర్ పైకి సీఎం రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిండని విమర్శించారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ల ద్వారా నడుస్తున్నదన్నారు. నాలుగు నెలల క్రితమే కంచ గచ్చిబౌలి భూముల్లో ఓ బీజేపీ ఎంపీ హస్తం ఉందంటూ కేటీఆర్ చెప్పారన్నారు. ఆ ఎంపీకి సంబంధించిన వివరాలు సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పారన్నారు.
ఎంపీ సీటును డబ్బులతో కొనుగోలు చేసిన వ్యక్తి సీఎం రమేశ్ అని దుయ్యబట్టారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన లగటపాటి, కావూరి, సుజన చౌదరిలు చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో పని చేసిన వీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారన్నారు. తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, కంచ గచ్చిబౌలి భూములను దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు.
సీసీ టీవీ ఫుటేజీ పేరుతో చేస్తున్న సీఎం రమేశ్ చేస్తున్న డ్రామాలను ప్రజలు విశ్వసించబోరన్నారు. సీఎం రమేశ్, రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలో బహిరంగ చర్చకు రావాలన్న కేటీఆర్ సవాల్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా ప్రీమియం కట్టలేదన్నారు. గ్రామాల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేదన్నారు. కేసీఆర్ ను బదనాం చేసేందుకే కాళేశ్వరం మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. అభివృద్ధి చేతగాక బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు.