శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 11:03:25

వంద రోజుల్లో పది వేలకుపైగా కరోనా మరణాలు

వంద రోజుల్లో పది వేలకుపైగా కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య పది వేల మార్కును దాటింది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 2003 మంది వైరస్‌ రోగులు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 11,903కు చేరింది. దేశంలో మార్చి 12నలో తొలి కరొనా మరణం నమోదు కాగా పది వేల మార్కును చేరేందుకు సుమారు వంద రోజుల సమయం పట్టింది. తొలి 5 వేల మరణాల నమోదుకు 80 రోజుల సమయం పట్టగా, 17 రోజుల్లోనే మరో 5 వేల మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో సుమారు 2,500 మంది కరోనాతో చనిపోయారు. 

దేశంలో కరోనా మరణాల రేటు కూడా ఇటీవల గణనీయంగా పెరిగింది. 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరింది. గత 24 గంటల్లో వైరస్‌ బారిన పడిన వారు 2003 మంది మరణించడంతో ఒక్క రోజులో మరణాల రేటు 3.3 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా 83 శాతం కరోనా మరణాలు బాగా ప్రభావితమైన మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావిత దేశాలతో పోల్చితే మన దేశంలో మరణాలు కాస్త తక్కువే. జనాభాతో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా సగటున 56 శాతం మంది కరోనాతో చనిపోగా భారత్‌లో ఇది 14 శాతంగా ఉన్నది. మన దేశంలో గత 24 గంటల్లో 10,974 వైరస్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,54,065కు చేరింది. కరోనా కేసుల పరంగా ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌ నాలుగో స్థానంలో, మరణాలవారీగా 8వ స్థానంలో ఉన్నది.logo