India | ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా(China) ప్రకటించింది. చైనా వ్యాఖ్యలను భారత్ (India) తీవ్రంగా ఖండించింది. పాక్‌తో కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని (No third party role) స్పష్టం చేసింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 10న జరిగిన కాల్పుల విరమణ.. రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా కుదిరిందని వెల్లడించింది. ‘మేము ఇప్పటికే అలాంటి వాదనలను తోసిపుచ్చాము. భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో పక్షం ప్రమేయం లేదు. రెండు దేశాల డీజీఎమ్వోలు నేరుగా సంప్రదింపులు జరిపి కాల్పుల విమరణ ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ విషయంపై గతంలో అనేక సందర్భాల్లో మా వైఖరిని స్పష్టం చేశాము’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇండోపాక్ ఉద్రిక్తతలపై మధ్యవర్తిత్వం వహించాం.. చైనా
పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపట్టింది. అయితే రెండు దేశాల డీజీఎంవోల చర్చల తర్వాతే ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేసినట్లు భారత్ పేర్కొన్నది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్య సంధికి తానే కీలక పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్నారు. సుంకాల బెదిరింపులతో రెండు దేశాలు దిగొచ్చాయని ప్రపంచ వ్యాప్తంగా చాటింపు వేసుకుంటున్నారు. అయితే, ట్రంప్ ప్రకటనలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. పాక్‌తో జరిగిన సమరంలో మూడవ దేశ పాత్ర లేదని చెప్పింది. అయితే, ఇప్పుడు ట్రంప్ తరహాలోనే ఇండోపాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో తాము కూడా పాత్ర పోషించినట్లు ఇప్పుడు చైనా చెప్పడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభాలను పరిష్కరించేందుకు శాంతిదూత పాత్రను చైనా పోషించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇండోపాక్ యుద్ధమే కాదు మయన్మార్, కంబోడియా-థాయ్‌ల్యాండ్, ఇరాన్ న్యూక్లియర్ సమస్యను కూడా పరిష్కరించినట్లు చైనా మంత్రి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో యుద్ధాలు, సీమాంతర దాడులు జరిగాయన్నారు. రాజకీయ అనిశ్చితి పెరిగిందన్నారు. శాంతి స్థాపన చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని, దీని కోసం ఆ సమస్యల మూలాలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశామన్నారు. బీజింగ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు భారత్ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
Also Read..
China: ఇండోపాక్ ఉద్రిక్తతలపై మధ్యవర్తిత్వం వహించాం.. ట్రంప్ తరహాలో చైనా మంత్రి ప్రకటన
Artificial Intelligence | కృత్రిమ మేధతో 2026లో నిరుద్యోగ బూమ్!.. ఏఐ గాడ్‌ఫాదర్ హింటన్ హెచ్చరిక
H-1B Visa | బాబోయ్.. మేం ఊరెళ్లం!.. ప్రయాణాలకు దూరంగా హెచ్-1బీ వీసాదారులు