న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఒక వైపు క్రిస్మస్, మరోవైపు నూతన సంవత్సర సెలవుల సీజన్ నడుస్తున్నా అమెరికాలోని వలసదారులు ఆ దేశం వదిలి తమ దేశానికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. సాధారణంగా సెలవుల కారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో ప్రయాణాల రద్దీ అధికంగా ఉంటుంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న రోజుకో నిర్ణయంతో యూఎస్‌లో ఉంటున్న వారు ఎక్కడికి వెళ్లకుండా అమెరికాలో ఉండటమే సురక్షితం అన్న నిర్ణయానికి వచ్చేశారు.
ఇటీవల వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం తమ దేశాలకు వెళ్లి, ట్రంప్ హఠాత్తు నిర్ణయంతో వేలాది మంది ఇరుక్కుపోయిన ఉదంతాలు వారిని మరింత భయపెడుతున్నాయి. అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో 27 శాతం మంది ఈ ఏడాది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఒక్క అనధికార వలసదారులే కాక, అధికారికంగా పౌరులైన వారు, సహజసిద్ధంగా ఆ దేశ పౌరులైన వారు కూడా ఇందులో ఉన్నారు.