Constitution Debate | పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు (Constitution Debate) విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ (Lok Sabha ), రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలందరూ అంగీకరించారు. ఇవాళ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజ్యాంగంపై చర్చ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. లోక్‌సభలో డిసెంబర్ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. చర్చ అనంతరం రాజ్యాంగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నట్లు తెలిసింది.
పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఉభయసభల్లో నిత్యం వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి చర్చలూ జరగకుండానే వాయిదాలు పడుతుండటంపై విపక్ష కూటమి ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్ ఘటన, అజ్మేర్ ఘటన, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం వీటిపై చర్చ ఇష్టంలేదని విమర్శిస్తున్నారు. వీటితోపాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు రాజ్యాంగంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని, అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినా ఎప్పుడు చర్చ చేపడుతారనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని జైరామ్ రమేష్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది.
Also Read..
Om Birla | అన్ని పార్టీల లోక్‌సభాపక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లా సమావేశం
Supreme Court | సుప్రీంకోర్టులో స్వల్ప అగ్నిప్రమాదం.. ఆ బెంచ్ విచారణలు రద్దు
Jairam Ramesh | పార్లమెంట్లో చర్చ జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు : జైరామ్ రమేష్