Om Birla : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్ ఛాంబర్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సభాకార్యకలాపాలు జరగకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, స్పీకర్ సభను వాయిదా వేయడం జరుగుతోంది.
దాంతో పార్లమెంట్లో చర్చ చేపట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లను స్పీకర్ కోరనున్నట్లు సమాచారం.
కాగా పార్లమెంట్లో గౌతమ్ అదానీ వ్యవహారంపైన, మణిపూర్ అంశంపైన, సంభాల్, అజ్మేర్ ఘటనలపైన, నిరుద్యోగ సమస్యపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. గత ఐదు రోజులుగా ప్రతిపక్షాలు ఇవే అంశాలపై చర్చకు పట్టుబడుతుండగా స్పీకర్ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇవాళ్టి ఫ్లోర్ లీడర్ల సమావేశం తర్వాతనైనా లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా సాగుతాయో లేదో చూడాలి