Jairam Ramesh : పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చ లేకుండా ఉభయసభలు నిత్యం వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతిరోజు సభలను ఎందుకు వాయిదా వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఎలాంటి చర్చలు జరపకుండానే ఉభయ సభలు వాయిదా పడుతుండటానికి బాధ్యులు ఎవరని జైరామ్ రమేష్ మండిపడ్డారు. ఇందుకు కచ్చితంగా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్ ఘటన, అజ్మేర్ ఘటన, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం వీటిపై చర్చ ఇష్టంలేదని విమర్శించారు.
ఉభయ సభలకు తాము ఇచ్చిన నోటీసుల గురించి ప్రభుత్వం కనీస ప్రస్తావన కూడా చేయడంలేదని, తమ నాయకులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని జైరామ్ రమేష్ అన్నారు. నేటికి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు అవుతోందని, అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేకుండా సభాకార్యకలాపాలు తుడిచి పెట్టుకుపోయాయని ఆయన మండిపడ్డారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు రాజ్యాంగంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని, అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినా ఎప్పుడు చర్చ చేపడుతారనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని జైరామ్ రమేష్ అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్లమెంట్లో చర్చ జరగకూడదని ప్రభుత్వం కోరుకోవడాన్ని తొలిసారి చూస్తున్నానని ఆయన చెప్పారు.