Pahalgam Attack | పెహల్గామ్ దాడి (Pahalgam Attack) నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ఉగ్రవాదులపై (Terrorists) భారత ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లోయలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాళు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా జమ్ము కశ్మీర్లోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు పేల్చేశాయి.
షోపియాలోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. అదేవిధంగా కుల్గాంలోని మతాలం ప్రాంతంలో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసంతోపాటు ఇదే జిల్లాలో లష్కరే ముఠాకు చెందిన మరో ఉగ్రవాది అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి. కుల్గాంలోని ముర్రా ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇల్లు, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో ముష్కరుడు హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో పేల్చేశాయి.
అయితే, భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని ఊహించి వారు రాగానే యాక్టివేట్ అయ్యేలా ఐఈడీలు ఉంచాడు. అతను ఊహించినట్టే ఇంటిని తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్ పోలీసులు వెళ్లారు. వారు ఇంట్లోకి రాగానే పేలుడు పదార్థాలు యాక్టివ్ అయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. మరో ఉగ్రవాది ఆదిల్ థోకర్ ఇంట్లో కూడా ఇలాగే బాంబు ద్వారా ట్రాప్ పెట్టినా పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్లతో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Also Read..
Illegal Immigrants: గుజరాత్లో అక్రమంగా ఉంటున్న 450 మంది బంగ్లాదేశీలు అరెస్టు
LOC | పాక్ కవ్వింపులు.. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులు