Pahalgam Attack | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్తు జాతి ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నది. 26 మంది అమాయకులను బలితీసుకొన్న ముష్కరులను శిక్షించాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పర్యాటకులకు కనీస భద్రతను కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యంపై కూడా పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి ఘటన ఓ సిగ్గుచేటని, నిఘా వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని మాజీ ఆర్మీ చీఫ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా తప్పుబడుతున్నారు. ఇంతటి ఘాతుకానికి తెగబడిన పాక్పై ఆంక్షల ప్రకటనలు, ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మండిపడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన మనకు నిజంగా సిగ్గుచేటు. ఈ ఘటనతో పాకిస్థాన్ మన చెంపపై చాచి కొట్టింది. పాక్ చర్యలను బట్టి చూస్తే.. మనతో యుద్ధానికి ‘సై’ అన్నట్టే కనిపిస్తున్నది. అయితే, ఉగ్ర దాడి ఘటనలో మనం అమాయకులను పోగొట్టుకొన్నాం. మరణాల ప్రకటనపై నాన్చివేత ధోరణి ప్రదర్శించడమెందుకు? ఇక, యూరి, పుల్వామా తర్వాత దీన్ని మనకు జరిగిన మరో పెద్ద అవమానంగానే భావించాలి.
దీనికి బదులుగా మనం ఏం చేయాలి? కానీ, మనం ఏం చేశాం? పాక్పై ఏవో దౌత్యపరమైన ఆంక్షలు విధిస్తూ.. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశాం. ఇది కరెక్టేనా? దేశ ప్రజలందరూ పాక్కు తగినరీతిలో బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నారు. అదే జరగాలి. ఇక్కడ మరో విషయం మనం గుర్తించి తీరాలి. గడిచిన మూడేండ్లుగా సైన్యంలో రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. 1.8 లక్షల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో సైన్యంపై ఒత్తిడి పెరుగుతున్నది. రిక్రూట్మెంట్ నిలిచిపోవడంతో సైన్యం బలహీనపడింది కూడా. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.
నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని నేను అనుకొంటున్నా. వైఫల్యానికి కారణమైన వాళ్లే జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలి. ఉగ్ర దాడికి పాకిస్థానే కారణం.పాక్పై దౌత్యపరమైన ఆంక్షలు సరిపోవు. ప్రతిఘటన ఉండాల్సిందే.
కశ్మీర్లో మొన్న ఎన్నికలు జరిగాయి. పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో కశ్మీర్లో శాంతి అనేది తాత్కాలికమే అని చూపించడానికే పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేశారు.
కశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి, పహల్గాంలో ఉగ్రదాడి జరగడమేంటి? భద్రతాపరమైన లోపాల వల్లే ఈ దాడి జరిగింది. దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం.