పాల్వంచ, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను ఏకకాలంలో రైతులకు చెల్లించాలని అలాగే రైతులు పండించిన పంటలకు మొక్కజొన్న, ఎర్రజొన్న,ఇతర పంటలకు కనీసం మద్దతు ధరలను అమలు చేయాలని డిమాండ్‌తో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఏఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రైతాంగం బ్రతుకులు దినదిన గండంగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వాలు సకాలంలో స్పందించడంలో విఫలమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. వానాకాలం సీజన్ ముగిసి యాసంగి సీజన్ సగం అయినా ప్రభుత్వ సాయాలు లేవన్నారు.
విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ బాడుగలు, నాట్లు తదితర వ్యవసాయ ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తీసుకు రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడంతో రాష్ట్ర రైతాంగం అప్పుల పాలై తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పోడు సాగుదారులందరికి పట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు ముగిసినప్పటికీ కూడా ఈనాటి వరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న, ఇతర పంటలు రైతుల వద్దకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, తక్షణమే మార్కెట్లు ఓపెన్ చేసి పంట కొనుగోలు చేయాలన్నారు. రైతుల పంటలన్నిటికీ గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేస్ ) జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మ, మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ, బైరు వెంకటేశ్వర్లు, బానోత్ వీరు, బాలు, శత్రు, వీరస్వామి, రమణి, సరోజ స్వప్న పాల్గొన్నారు.