Maa Inti Bangaaram | టాలీవుడ్ అగ్ర నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుండగా.. వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన ఉగాది స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ప్రముఖ యాంకర్ సుమ తనదైన శైలిలో సందడి చేశారు. ఈ ప్రోమోలో సమంత స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేస్తూ, మామిడికాయలు కోస్తూ కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సమంత పచ్చడి కలిపే విధానంపై సుమ వేసిన సెటైర్లు, వారి మధ్య జరిగిన సరదా సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీస్’పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథను అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో సమంత చీరకట్టులో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తూ కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవితంలోని షడ్రుచులను ప్రతిబింబించే ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను వివరిస్తూ సాగిన ఈ ప్రత్యేక కార్యక్రమం సినిమా ప్రమోషన్లకు కొత్త జోష్ ఇచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.