శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడితో (Pahalgam Attack) దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నవేళ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతున్నది. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (LOC) వెంబడి భారత సైనికులపై కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ.. మరోసారి అత్యుత్సహాన్ని ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్‌తోపాటు లఢక్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత పోస్టులపై పాక్ సైనికులు ఫైరింగ్ జరిపారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టామని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.
‘ శుక్రవారం రాత్రి కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు లేకుండా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత దళాలు కూడా అదే స్థాయిలో స్పదించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.
గురువారం రాత్రి కూడా జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. వీటిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలోని పారామిలిటరీ దళాలకు రక్షణ శాఖ సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
సరిహద్దులు మూసివేత
జమ్ములోని సుచేత్‌గఢ్ వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దును పౌరులకు మూసివేశారు. సుచేత్‌గఢ్‌లోని ఆక్ట్రాయ్ పోస్టు వద్ద పౌర కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్ఎఫ్) శుక్రవారం నిలిపివేసింది. పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న అటారీ, హుస్సేనీవాలా, సడ్కీ వద్ద రిట్రీట్ కవాతులను రద్దు చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో సుచేత్‌గఢ్ వద్ద తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుచేత్‌గఢ్‌లో కూడా రిట్రీట్ కవాతు జరగడం సంప్రదాయంగా వస్తోంది. భారత అంతర్జాతీయ సరిహద్దు ఉత్తరాన జమ్ము నుంచి ప్రారంభమై పంజాబ్, రాజస్థాన్ మీదుగా పశ్చిమాన గుజరాత్ వరకు వెళుతుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమన్న భారత్ సంకల్పాన్ని తాజా పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
జమ్ముకశ్మీర్ పరిస్థితులపై చర్చించడానికి అన్ని సైనిక విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీరు వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. శ్రీనగర్‌లోని విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీరులో పరిస్థితిని సమీక్షించేందుకు భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు.
సరిహద్దుల వద్ద పాక్ భారీగా బలగాలు
పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం శుక్రవారం గతన సిబ్బందికి ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రానున్న రోజుల్లో ఎవరికీ కొత్త సెలవులు మంజూరు చేయవద్దని సైనిక త్రివిధ దళాలకు చెందిన కమాండర్లను ఆదేశించింది. గతంలో అఫ్గానిస్థాన్, బలూచిస్థాన్‌కు సరిహద్దు భద్రతను నిర్వహించిన సైనిక సిబ్బందిని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాక్ నియమించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 10 కోర్ కమాండర్ పరిధిలోని భారత్-పాక్ వాస్తవాధీన రేఖ సమీపంలో గణనీయమైన సంఖ్యలో సైనిక సిబ్బందిని నియమించాలని బలూచిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో నియమించిన 11 కోర్, 12 కోర్కు చెందిన కమాండర్లను పాక్ సైన్యం ఆదేశించింది. భారత్ నుంచి చొరబాటు ఉండని కారణంగా గతంలో ఎన్నడూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-పాక్ సరిహద్దు సైనిక బలగాలను పాక్ నియమించలేదు.