Honeymoon murder : మేఘాలయ (Meghalaya) లో జరిగిన రాజారఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాకొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాతనే తన ప్రియుడు రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) తో కలిసి సోనమ్ భర్త హత్యకు కుట్రపన్నిందని భావిస్తుండగా.. పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర జరిగిందని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందే వారి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అంటే సుమారుగా పెళ్లికి మూడు నెలల ముందే తన ప్రియుడు రాజ్‌కుశ్వాహతో కలిసి సోనమ్.. కాబోయే భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్రపన్నినట్లు విచారణలో తేలింది. ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజా రఘువంశీని పెళ్లిచేసుకుని హత్యచేస్తే.. విధవరాలైన తనను ప్రియుడికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తారని సోనమ్ భావించింది.
పోలీసుల విచారణలో సోనమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ హత్య చేస్తే కటకటాలపాలై జీవితం సర్వనాశనం అవుతుందనే విషయాన్ని మాత్రం సోనమ్, ఆమె ప్రియుడు రాజ్‌కుశ్వాహాలు ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం. కాగా మే 11న రాజా, సోనమ్‌ల వివాహం జరగగా మే 23న రాజారఘువంశీ హత్యకు గురయ్యాడు. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ సోనమ్ హత్య చేయించింది.
రాజ్కుశ్వాహ ముగ్గురు స్నేహితులు ఈ హత్యలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. ఉత్తరఖాసీ కొండల్లో రాజా, సోనమ్ ట్రెక్కింగ్ చేస్తుండగా నిందితులు దాడిచేసి హతమార్చారు. ఆ తర్వాత హంతకులు, సోనమ్ కలిసి రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో పడేశారు. సోనమ్‌ను ఇండోర్‌కు తీసుకెళ్లి దాచిపెట్టారు. మరో మహిళను హత్యచేసి తగులబెట్టి అది సోనమ్ మృతదేహంగా నమ్మించాలని చూశారు.
కానీ 18 రోజులపాటు చూసినా మరో మహిళ హత్య సాధ్యం కాలేదు. దాంతో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. తనను ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని నాటకం ఆడింది. కానీ అప్పటికే హత్యలో సోనమ్ పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆమె మాటలు నమ్మలేదు. విచారణలో హత్యలో తనపాత్ర కూడా ఉన్నట్లు ఒప్పుకుంది.