పాట్నా: బీహార్‌కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ కేసీ సిన్హా (Professor KC Sinha) తొలిసారి ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోట అయిన పాట్నాలోని కుమ్రార్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ గురువారం 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. గణిత శాస్త్రవేత్తగా నాలుగు దశాబ్దాల పాటు విద్యార్థుల సేవలో తరించిన 74 ఏళ్ల ప్రొఫెసర్ కేసీ సిన్హా పేరు ఇందులో ప్రముఖంగా కనిపించింది.
కాగా, 1954లో బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కేసీ సిన్హా జన్మించారు. ఆ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌పై పాట్నాలో చదువుకున్నారు. పాట్నా సైన్స్ కాలేజీలో ఇంటర్, బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. పాట్నా యూనివర్సిటీలో ఎంఎస్సీ అభ్యసించారు.
కేసీ సిన్హా 28వ ఏటా కోఆర్డినేట్ జామెట్రీపై తొలి గణిత పుస్తకాన్ని రాశారు. నాటి నుంచి నాలుగు దశాబ్దాల పాటు 70కు పైగా పాఠ్యపుస్తకాలు రచించారు. స్కూల్ విద్యార్థులను ఆకట్టుకోవడంతో హాట్ కేకుల్లా అవి అమ్ముడయ్యాయి. గత 30 ఏళ్లుగా బీహార్, ఇతర రాష్ట్రాల్లోని స్కూళ్లలో ఆయన రాసిన పాఠ్యపుస్తకాలను బోధిస్తున్నారు. అలాగే నాణ్యమైన విద్యను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడానికి సిన్హా చాలా కృషి చేశారు. పేద విద్యార్థులకు జేఈఈలో ఉచితంగా శిక్షణ కూడా ఇచ్చారు.
మరోవైపు పాట్నా యూనివర్సిటీ, నలంద ఓపెన్ విశ్వవిద్యాలయం, మగధ యూనివర్సిటీతోపాటు బీహార్‌లోని అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా కేసీ సిన్హా పనిచేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ శిక్షా పురస్కార్, ఐకాన్స్ ఆఫ్ బీహార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడిగా పేరొందిన ప్రొఫెసర్ కేసీ సిన్హా తొలిసారి ఎన్నికల లెక్కల పరీక్షకు సిద్ధమవుతున్నారు.
Also Read:
Man Kills Wife | భార్యను చంపి.. మృతదేహాన్ని మంచం కింద దాచిన వ్యక్తి
Elephants Trample Man | మానసిక వికలాంగుడిని.. తొక్కి చంపిన ఏనుగులు