Pune Students : స్టడీ విజిట్ కోసం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన కొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. పూనేకు చెందిన 84 మంది విద్యార్థులు ఇటీవల స్టడీ విజిట్‌లో భాగంగా దుబాయ్ వెళ్లారు. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం దుబాయ్‌పై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం కూడా దాడులు కొనసాగుతున్నాయి.
దీంతో అక్కడి ఎయిర్‌పోర్టుల్ని మూసివేశారు. ఫలితంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా పలువురు భారతీయులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఇందులో సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు సహా సాధారణ ప్రజలు, టూరిస్టులు ఉన్నారు. వారిలో పూనేలోని ఒక పాఠశాలకు చెందిన 84 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, ఈ అంశంపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. విద్యార్థుల బృందమంతా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వీలైనంత త్వరగా విద్యార్థుల్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ, దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం కూడా విద్యార్థుల బృందాన్ని సంప్రదించింది.
అలాగే కేంద్ర పౌరవిమానయాన శాఖ కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. పరిస్థితి సద్దుమణిగి, విమానాల రాకపోకలు ప్రారంభమైన వెంటనే విద్యార్థుల్ని తీసుకొస్తామని తెలిపాయి. ప్రస్తుతం దుబాయ్‌పై ఇరాన్ దాడి చేస్తుండటంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.