Naveen Patnaik | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు భువనేశ్వర్ (Bhubaneswar)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు (Hospitalised). ఆస్పత్రి వైద్యులు నవీన్ పట్నాయక్‌కు చికిత్స అందిస్తున్నారు.
శనివారం రాత్రి నవీన్ పట్నాయక్ అసౌకర్యానికి గురికావడంతో వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి పరీక్షించారు. అయితే, పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రిలో చేరారు. నవీన్ పట్నాయక్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు సహకరిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.
కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇటీవలే ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు జూన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, రెండు నెలల్లోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆ జగన్నాథుడిని ప్రార్థించారు.
సుదీర్ఘకాలం ఒడిశా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నవీన్ పట్నాయక్, వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. మార్చి 2000 నుంచి జూన్ 2024 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 24 ఏళ్లు ఒడిశాకు సీఎంగా సేవలందించిన నవీన్ పట్నాయక్ దూకుడుకు బీజేపీ అడ్డుకట్టవేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ పార్టీ పరాజయం పాలైంది. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Also Read..
Army Jawan | ఆర్మీ జవాన్‌ను పోల్‌కు కట్టేసి కర్రలతో దాడిచేసిన టోల్ సిబ్బంది.. వీడియో
Air India | చివరి నిమిషంలో విమానం టేకాఫ్ రద్దు.. రన్‌వే నుంచి జారినట్లైందంటూ ఎంపీ పోస్ట్
Shubhanshu Shukla | నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్ హీరో శుభాన్షు శుక్లా