Air India | అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం అనంతరం దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రమాదం తర్వాత నుంచి సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆ సంస్థ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. కొచ్చి (Cochin) నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన విమానం చివరి నిమిషంలో టేకాఫ్ (take off) రద్దు కావడమే అందుకు కారణం. ఈ విమానంలో లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత (Congress MP) హిబి ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు. ఊహించని ఈ సంఘటనపై ఎంపీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఎయిర్ ఇండియాకు చెందిన AI 504 విమానం ఆదివారం రాత్రి 10:34 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. అయితే, టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్‌ను సిబ్బంది రద్దు చేశారు. టేకాఫ్ రోల్ సమయంలో సాంకేతిక సమస్య గుర్తించినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, టేకాఫ్ రన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారని తెలిపింది. నిర్వహణ తనిఖీల కోసం విమానాన్ని బేకు తరలించినట్లు పేర్కొంది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో గమ్య స్థానాలకు తరలించినట్లు వెల్లడించింది. ఊహించని ఈ పరిస్థితి కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
కాగా ఈ ఘటన సమయంలో విమానంలో లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ కూడా ఉన్నారు. ఊహించని ఈ సంఘటనపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో రన్‌వే నుండి జారిపోయినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు. ఆ సమయంలో విమానంలో ఏదో అసాధారణమైనది జరిగిందన్నారు. తెల్లవారుజామున ఒంటి గంటకు తదుపరి విమానాన్ని ప్రకటించారని, అయితే ఇంకా బోర్డింగ్ ప్రారంభించనేలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తాజా ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Shubhanshu Shukla | నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్ హీరో శుభాన్షు శుక్లా
Bomb Threat | పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులే లక్ష్యంగా మందుపాతర.. జవాన్ మృతి