అహ్మదాబాద్: అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఫారెస్ట్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Forest Officer Murders Wife, Children) గుజరాత్లో ఈ దారుణం జరిగింది. 39 ఏళ్ల అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) శైలేష్ ఖంభాలా, భావ్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. క్వాటర్స్‌లో అతడు నివసిస్తున్నాడు. 42 ఏళ్ల భార్య నయన, 13 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు సూరత్‌లోని అత్తవారింట్లో ఉంటున్నారు.
కాగా, దీపావళి పండగ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శైలేష్ భార్య నయన తన ఇద్దరు పిల్లలతో కలిసి భావ్‌నగర్ వచ్చింది. అయితే నవంబర్ 5న భార్య, పిల్లలు క్వాటర్స్ నుంచి అదృశ్యమైనట్లు ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను విధుల్లో ఉన్నప్పుడు, పిల్లలతో కలిసి తన భార్య ఆటోలో వెళ్లినట్లు సెక్యూరిటీ గార్డు చెప్పాడని పోలీసులకు తెలిపాడు.
మరోవైపు సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నించగా శైలేష్ చెప్పింది అబద్ధమని తేలింది. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు వింతగా ప్రవర్తిస్తుండటంతో ఆయనపై అనుమానం వ్యక్తం చేశారు. శైలేష్ కాల్ డాటాను పోలీసులు పరిశీలించారు. భార్య, పిల్లల అదృశ్యమైన మూడు రోజుల ముందు జూనియర్ అధికారి గిరీష్ వానియాతో ఆయన మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
కాగా, గిరీష్‌ను పోలీసులు ఆరా తీశారు. నవంబర్ 2న శైలేష్ తనకు కాల్ చేసినట్లు అతడు తెలిపాడు. క్వాటర్స్ వద్ద చెత్త పేరుకుపోయిందని, ఇంటి వెనుక రెండు గుంతలు తీయమని చెప్పడంతో జేసీబీని తెప్పించి ఆ పని చేయించినట్లు చెప్పాడు. ఆ తర్వాత నవంబర్ 6న ఆ గోతితో జింక పడి చనిపోయిందని, మట్టితో పూడ్చేందుకు డంపర్ లారీ పంపాలని చెప్పడంతో పంపినట్లు గిరీష్ వెల్లడించాడు.
దీంతో నవంబర్ 16న గిరీష్‌ను తీసుకుని శైలేష్ క్వాటర్స్‌కు పోలీసులు చేరుకున్నారు. ఇంటి వెనుక ఉన్న రెండు గోతులను తవ్వించారు. అందులో పాతిన నయన, ఇద్దరి పిల్లల మృతదేహాలను వెలికితీశారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారి శైలేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్తవారింట్లో కాకుండా భర్తతో కలిసి భావ్‌నగర్‌లో ఉంటానని నయన గొడవ చేయడంతో భార్య, పిల్లలను చంపినట్లు శైలేష్ ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: కొత్తగా కొనుగోలు చేసిన థార్‌లో సమస్యలు.. షోరూమ్‌కు లాక్కెళ్లిన గాడిదలు