Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దాదాపు 7లక్షల మంది జనం ప్రభావితమయ్యారు. వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోం, మేఘాలయలో భారీ విధ్వంసం నెలకొంది. రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నది. అసోంలోని 21 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.32 లక్షలకుపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రోడ్డు, రైలు, ఫెర్రీ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని రెండు Mi-17 V5 హెలికాప్టర్లలో సమీపంలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి తరలించారు. ఇప్పటివరకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1,700 మందిని తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిక్కింలోని లాచెన్ నగరంలోని ఛతెన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడగా.. ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)కి చెందిన 23 మంది సభ్యుల బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నది.
అదే సమయంలో తీస్తా నదిలో వాహనంతో పాటు కొట్టుకుపోయిన ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. మేఘాలయలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇండోర్‌కు చెందిన పర్యాటకుడి కోసం గాలిస్తున్నది. రాజా రఘువంశీ (29) తూర్పు ఖాసీ హిల్స్ సోహ్రాలో చనిపోగా.. ఆయన భార్య సోనమ్ ఆచూకీ దొరకలేదు. ఆమె ఆచూకీ కోసం 17 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం అన్వేషిస్తున్నది. గత 10 రోజుల్లో కుండపోత వర్షాలతో 552 కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడడంతో 152 ఇండ్లు దెబ్బతిన్నాయి. అసోంలోని బాధిత ప్రజల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయి.
31,212 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరో వైపు మణిపూర్‌లో వరదలు పోటెత్తుతుండగా.. 1.64లక్షల మంది ప్రభావితమయ్యారు. 35,143 ఇండ్లు దెబ్బతిన్నాయి. అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్‌తో వరద పరిస్థితులపై ప్రధాని సమీక్షించారు. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమాచారం మేరకు.. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా అస్సాంలో 17 మంది, అరుణాచల్‌లో 11 మంది, మేఘాలయలో ఆరుగురు, మిజోరాంలో ఐదుగురు, సిక్కింలో ముగ్గురు, త్రిపురలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక బిహార్‌లోని సివాల్ జిల్లాలో భారీ వర్షానికి ఏడుగురు మృతి చెందారు.
NEET PG 2025 | ఆగస్టు 3న నీట్-పీజీ..! అనుమతి కోరుతూ సుప్రీంకోర్టుకు ఎన్బీఈ
Operation Sindoor | మోదీ జాతికి జవాబు చెప్పండి! ప్రధానికి ఎంపీల లేఖ..!