న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-పీజీ-2025 పరీక్షను జూన్ 15 నుంచి ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసేందుకు అనుమతి కోరుతూ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నీట్-పీజీ పరీక్షను నిర్వహించగలమని ఎన్బీఈ తన పిటిషన్లో తెలియచేసింది.
మే 30న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సాధ్యమైనంత త్వరగా పరీక్షను నిర్వహించడానికి అనువైన తేదీగా ఆగస్టు 3ని నిర్ణయించిందని, ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్బీఈ సుప్రీంకోర్టును కోరింది. రెండు షిఫ్టులలో కాకుండా ఒకేషిఫ్టులో పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా జూన్ 15న నిర్వహించాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్బీఈ తెలిపింది.